Grass lands (గడ్డిమైదానాలు) గురించి వివరింపుము?
గడ్డిమొక్కలు ఎక్కువగా, ఇతర పొదలు, చిన్నపాటి చెట్లు తక్కువగా ఉండే పచ్చికబయిళ్లను గడ్డిమైదానాలు అంటారు.
గడ్డిమొక్కలు ఎక్కువగా, ఇతర పొదలు, చిన్నపాటి చెట్లు తక్కువగా ఉండే పచ్చికబయిళ్లను గడ్డిమైదానాలు అంటారు. భారతదేశపు గడ్డిమైదానాలు వివిధ భౌగోళిక ప్రాంతాలలో, వివిధ శీతోష్ణ పరిస్థితులలో విస్తరించి ఉన్నాయి. భారతదేశపు గడ్డిజాతులు అనేక అరుదైన జంతు వృక్షజాతులకు ఆవాసంగా ఉన్నవి. కొన్ని జాతులు గడ్డిమైదానాలలో మాత్రమే నివసించేవి కూడా కలవు. గడ్డిమైదానాలు స్థానిక ప్రజలకు, పశుగ్రాసం, వంటచెరకు, ఇళ్లనిర్మాణంలో వినియోగించే గడ్డిని అందించుట వంటి అనేకవిధాలుగా ఉపయోగపడుతున్నవి. ఈ గడ్డిమైదానాలు ప్రస్తుతం విపరీతంగా ఆక్రమణలకు, దుర్వినియోగానికి గురవుతున్నవి.
గడ్డిమైదానాల రకాలు
భారతదేశపు గడ్డిమైదానాలలో సుమారు 1200 జాతులకు చెందిన గడ్డిరకాలను గుర్తించారు. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి. ఆండ్రోపొగొనే (Andropogoneae-30%) పానిసే, (Paniceae -15%) ఎరాగ్రొస్తే ( Eragrostae-9%) లు
పై వాటిలో చాలావరకు పశుగ్రాసంగా పనికివస్తాయి. కొన్ని ప్రధాన గడ్డి జాతులు
శాస్త్రీయనామము
ఎ. Chrysopogon zizanioides (వట్టివేర్లు)
బి. Panicum antidotale (సామలు)
సి. Imperata cylindrica (కురకుర)
డి. Echinochloa (రెల్లుగడ్డి)
గడ్డిమైదానాల లక్షణాలు
1. పచ్చికబయిళ్ల ఆవరణ వ్యవస్థలో గడ్డి మొక్కలు ప్రధానమైన జీవులు. చిన్నచెట్లు, పొదలు, గుబుర్లు కూడా గడ్డిమైదానాలను ఏర్పరచటంలో పాత్రవహిస్తాయి.
2. భారతదేశ గడ్డిమైదానాలలో కీటకాలు పక్షులు ప్రధాన పాత్రవహిస్తాయి. మేసేజీవులు, కీటకాహార జీవులు భారతదేశగడ్డిమైదానాలకు జీవవైవిధ్యాన్ని ఇచ్చే జంతువులు.
3. అడవులు లేదా ఎడారుల చివర్లలో ఈ గడ్డిమైదానాలు సాధారణంగా విస్తరించి ఉంటాయి. కొన్ని సార్లు దట్టమైన అడవుల మధ్య అక్కడక్కడా కూడా విస్తరించి ఉండవచ్చు.
4. గడ్డిమైదానాల యొక్క బయాటిక్ కాంపొనెంట్స్
అ. ఉత్పత్తిదారులు: గడ్డిమొక్కలు, పొదలు, నాచు, ఆల్గే వంటి జీవులు సూర్యరశ్మిని గ్రహించి ఆహారపదార్ధాలను తయారుచేసుకొని గడ్డిమైదాన ఆవరణవ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంటాయి.
ఆ. వినియోగదారులు: ఆహరముకొరకు ఇతరులపై ఆధారపడే జీవులను వినియోగదారులు అంటారు. లేడి, దుప్పి, మేకలు, గొర్రెలు, మిడతలు వంటి శాఖాహారవినియోగదారులు - పులి, తోడేలు, నక్క, గద్ద, కొంగ, పాము వంటి మాంసాహార వినియోగదారులు - ఎలుగుబంటి, బాడ్జర్, వివిధరకాల పక్షులు వంటి మిశ్రమాహార జీవులు - గడ్డిమైదానాలలో వినియోగదారులుగా ఉన్నాయి.
ఇ. విచ్ఛిన్నకారులు: బాక్టీరియా, ఫంగై, పురుగులు కుళ్ళుతున్న సేంద్రియపదార్ధాలను విచ్చిన్నం చేసి లవణాలుగా, మార్చి తిరిగి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి.
5. ఈ మొక్కలు గాలిద్వారా పరాగ సంపర్కం జరుపుకొని, గాలిద్వారా వ్యాప్తిచెందే విత్తనాలను ఏర్పరచును.
6. ఈ మొక్కలకు సాగేగుణం ఉండి, తొక్కినా, ఈదురుగాలులువీచినా, తట్టుకొని తిరిగి నిలబడగలిగే స్థితి ఉంటుంది.
గడ్డిమైదానాలు వివిధ రకాలు
ఎ. పచ్చికబయిళ్ళు: ఇవి ఎత్తుతక్కువ కలిగిన గడ్డిమైదానాలు. పశుగ్రాసానికి ఎక్కువగా ఉపయోగపడతాయి
బి. ప్రైరీలు: వీటియందు ఎత్తైన గడ్డి మొక్కలు, చిన్నచిన్న పొదలు ఉంటాయి
సి. సవన్నాలు: ఎత్తైన గడ్డి మొక్కలు (1మీ నుండి 4.5 మీ ఎత్తు) అక్కడక్కడా విస్తరించిన చెట్లు కలిగి ఉంటాయి. ఇ ఈ మైదానాలలో ఎక్కువగా Acacia savannah అనే జాతి మొక్కలు అధికంగా ఉంటాయికనుక వీటిని సవన్నా లు అని అంటారు.
వాతావరణ పరిస్థితులను బట్టి భారతదేశపు గడ్డిమైదానాలను మూడు రకాలుగా విభజించారు
ఎ. క్సిరొఫిలస్ గడ్డిమైదానాలు (Xerophilous grasslands): ఇవి ఉత్తరపశ్చిమ భారతదేశంలో ఉండే పాక్షిక ఎడారి ప్రాంతాలలో కనిపిస్తాయి. వీటిలో ఎక్కువగా అండ్రోపొగన్ జాతి గడ్డి మొక్కలుంటాయి.
బి. మిసొఫిలస్ గడ్డిమైదానాలు (Mesophilous grasslands): వీటినే సవాన్నాలు అనికూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా విస్తరీంచి ఉన్నాయి. Saccharum munja జాతిగడ్డి మొక్కలు అధికం.
సి. హైగ్రొఫిలస్ గడ్డిమైదానాలు (Hygrophilous grasslands): చిత్తడినేలలలో పెరిగే గడ్డిమైదానాలు.
మితిమీరిన మానవ ప్రమేయం వలన గడ్డిమైదానల విస్తీర్ణం తగ్గిపోతున్నది. పంజాబ్ లో వ్యవసాయమ్ కొరకు గడ్దిమైదానాలను దాదాపు తొలగించటం జరిగింది. గడ్డిమైదానాలు అన్నిరకాల ఆవాసాలలో నివసించగలవు.
వ్యవసాయానికి, మానవ మనుగడకు గడ్డిమైదానాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటిని కాపాడుకోవటం మన విధి.
No comments:
Post a Comment