Illegal Wildlife Trade and Pet Trade in India
వన్యప్రాణులను లేదా వాటి ఉత్పత్తులతో చేసే చట్టవ్యతిరేక వ్యాపారాన్ని చట్టవ్యతిరేక వ్యన్యప్రాణుల వ్యాపారం (Illegal Wild Life Trade) అంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. దీనిని అరికట్టటానికి CITES – United Nations’ Convention on International Trade in Endangered
Species అనే సంస్థ కృషిచేస్తుంది. భారతదేశం కూడా ఈ సంస్థలో భాగస్వామి. TRAFFIC- Trade Records Analysis of Flora and
Fauna in Commerce అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వన్యప్రాణుల వ్యాపారాన్ని పర్యవేక్షిస్తూ, ఆయా ప్రభుత్వాలకు తగిన సూచనలు ఇస్తుంది. ఈ సంస్థ 1991 నుండి భారతదేశంలో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించింది.
ఈ చట్టవ్యతిరేక వన్యప్రాణుల వ్యాపారం లో సులభంగా డబ్బు లభిస్తుండటం ఎక్కువమంది దీనిపట్ల ఆకర్షితులవు తున్నారు. అంతే కాక, వన్యప్రాణి ఉత్పత్తులకు డిమాండ్ ఉండటం, ప్రజలకు అవగాహన లేకపోవటం వంటివి కూడా వన్యప్రాణుల వ్యాపారానికి దోహదపడుతున్న అంశాలు.
2011 లో 23 టన్నుల బరువుకల ఏనుగుదంతాలను ప్రపంచవ్యాప్తంగా పట్టుకొన్నారు. దీనిని సేకరించటానికి సుమారు 2500 ఏనుగులను చంపాలి. దీనినిబట్ట ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం
చేసుకొనవచ్చును.
వన్యప్రాణులవ్యాపారం వన్యప్రాణి సంరక్షణకు పెద్ద సవాలుగా పరిణమించింది.
వివిధ వన్యప్రాణి ఉత్పత్తులు
ఎ. చర్మం, గోళ్ళు, ఎముకల కొరకు పులులు, చిరుతపులులను విపరీతంగా వేటాడి చంపుతున్నారు
బి. ఖడ్గమృగం కొమ్ము నుండి చేసిన నాటుమందులు లైంగికసామర్ధ్యం పెంచుతుందనే ఉద్దేశంతో వాటి వ్యాపారం జరుగుతున్నది.
సి. ఏనుగు దంతానికి అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ కలదు. ఏనుగుదంతంతో ఆభరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తారు.
డి. ఆట్టర్ (Otter-నీటి పిల్లి) చర్మాన్ని కోట్లు తయారుచేయటంలో వాడతారు
ఇ. కస్తూరి మృగం (మస్క్ డీర్) నుండి కస్తూరి అనే సుగంధద్రవ్యాన్ని సేకరిస్తారు.
ఎఫ్. చిరు (Chiru-tibetan antelope)అనే ఒక పర్వతదుప్పి నుండి సేకరించే ఉన్నితో శాలువాలు చేస్తారు
జి. ఎలుగుబంటి క్లోమరసంతో కొన్ని మందులు తయారుచేస్తున్నారు
హెచ్. ముంగిస తోక వెంట్రుకలతో పెయింటింగ్ బ్రష్ లు చేస్తారు
ఐ. పాము చర్మాలతో బెల్టులు, పర్సులు తయారు చేస్తున్నారు.
జె. సముద్రతాబేళ్ళను గుల్లల/కవచం కొరకు చంపుతున్నారు
కె. సీతాకోకలను డెకరేటివ్ వస్తువులు తయారుచేయటానికి వాడుతున్నారు.
ఎల్. అనేక రకాల పక్షులను మాంసం కొరకు, వాటి అందమైన ఈకలకొరకు వేటాడుతున్నారు. కొయిల, మైనా, రామచిలుకలు వంటివాటిని పెంచుకోవటం కోసం బంధిస్తున్నారు
ఎమ్. అదృష్టాన్నిస్తుందనే నమ్మకంతో నక్షత్ర తాబేళ్లను పెంచుకోవటానికి బంధిస్తున్నారు
ఎన్. షార్క్ ఫిన్ లను సూప్ ల తయారీలో, సముద్రగుర్రాలను ఆక్వేరియం ల కొరకు, మందులతయారీకీ, కోరల్స్, వివిధ నత్తగుల్లలు అలంకరణ వస్తువుల తయారీ కొరకు వాడుతున్నారు.
ఒ. దూదికూరిన వన్యజీవుల తలకాయలను (పులి, లేడి, దుప్పి, ఎలుగుబంటి వంటివి) రాజ చిహ్నాలుగా గోడలకు తగిలించుకొంటున్నారు.
పి. ఎర్రచందనం, చందనం, రోజ్ వుడ్, టేకు వంటి చెట్లను విలువైన వాటి దుంగల కొరకు నరుకుతున్నారు.
క్యు. భారతదేశంలో ఉడుము, అలుగు(పాంగొలిన్), ఉడత, గబ్బిలాలను ఆహారంగాతీసుకొంటారు.
వ్యవస్థీకృతంగా ఉంటున్న వన్యప్రాణుల వ్యాపారం
వన్యప్రాణుల వ్యాపారం ఒక టెర్రరిజం లా, డ్రగ్ ట్రాఫికింగ్ లా వ్యవస్థీకృతంగా ఉంది. కొన్ని సందర్భాలలో టెర్రరిస్టులు, డ్రగ్ ట్రఫికర్స్ కూడా దీనిలో పాలుపంచుకొంటున్నారు.
భారతదేశ వన్యప్రాణుల వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా పులు చర్మాలకు, ఏనుగుదంతాలకు భారతదేశం ప్రధాన సరఫరాదారునిగా ఉంది. దీనికి కారణాలు
భారతదేశం విశాలమైన ప్రకృతి సంపద, అరుదైన జీవవైవిద్యంతో ఉండటం వలన ఇక్కడనుంచి పెద్దస్థాయిలో వన్యప్రాణుల వ్యాపారం జరుగుతున్నది.
పులులు, ఖడ్గమృగాలు, ఏనుగుదంతాలు, పక్షులు ఏదికావాలంటే అది దొరికే పరిస్థితి ఉంది.
ఇక్కడి ప్రజలలో నిరక్షరాస్యతా, వన్యప్రాణులు అంతరించిపోవటం పట్ల అవగాహన లేకపోవటం, పేదరికం వంటివి వన్యప్రాణుల వ్యాపారాన్ని చేసే పరిస్థితులు కల్పిస్తున్నాయి.
మనమేం చెయ్యాలి?
ఎ. వన్యప్రాణుల ఉత్పత్తులతో చేసే వస్తువులను కొనటం మానేయ్యాలి.
బి. వన్యప్రాణులను సంరక్షిస్తున్న సంస్థలతో వ్యక్తులతో చేతులు కలిపి తోడ్పడాలి
సి. మన పరిసరాలలో ఇలాంటి వ్యాపారం జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు తెలియచేయాలి.
డి. ప్రజలను చైతన్యపరచి, అవగాహనా సదస్సుల ద్వారా వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని పదిమందికి తెలియచేయాలి
ఇ. మనపిల్లలకు వన్యప్రాణి సంరక్షణ గురించి చిన్నప్పటినుంచే బోధీంచాలి.
చట్టవ్యతిరేక పెంపుడు జంతువుల వ్యాపారం
అనేక వన్యప్రాణులను సరదాకొరకు లేదా అదృష్టం కలిసి వస్తుందనో ఇండ్లలో కొంతమంది పెంచుకొంటారు. కానీ ఒక బుల్ బుల్ పిట్ట అలా ఒక ఇంటికి చేరే మార్గంలో సుమారు పదికి పైగా బుల్ బుల్ పక్షులు చనిపోతాయి. ఆ విధంగా అనేక జీవులు పెట్ ట్రేడ్ పేరిట చంపబడుతున్నవి.
వన్యప్రాణులను ఇండ్లలో ఉంచుకొవటం చట్టరీత్యానేరం కూడా.
పెంపుడు జంతువులుగా పెంచబడుతున్న వివిధ జీవులు
పక్షులు: పక్షులు చాలా పేరొందిన పెంపుడు జీవులు. రామచిలుకల సంఖ్యతగ్గిపోవటానికి కారణం ఇదే. 1991 లో వన్యప్రాణులను ఇండ్లలో పెంచటం నిషేదించినా, వీటిని బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. కొన్ని రకాల పక్షులు పేంపకం కొరకే కాక అదృష్టం కొరకు, వైద్యం కొరకు కూడా వేటాడబడుచున్నాయి.
ప్రతి ఏటా సుమారు 5 లక్షల పక్షులు ఈ రకంగా విక్రయింపబడుతున్నవి. దుబాయ్ లో పెరెగ్రైన్ గద్దలు ఒక్కొక్కటి 5 నుంచి 7 లక్షల రుపాయిలవిలువ ఉంది.
భారతదేశపు పెట్ ట్రేడ్ లో మైనా, ఎర్రమెడ రామచిలుక, గుడ్లగూబలు, కోయిలలు వంటివి ప్రధానంగా ఉన్నాయి. వీటిలో మైనాలు శబ్దాలను అనుకరించటం వల్ల, గుడ్లగూబ లక్ష్మీ దేవికి ప్రతిరూపమనే నమ్మకంవల్ల వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది.
తాబేళ్ళు: నక్షత్రతాబేళ్ళు అదృష్టాన్ని ఇస్తాయనే నమ్మకంతో ఇళ్ళల్లో పెంచుకొంటారు. అదే విధంగా ఇండియన్ టెంట్ తాబేలు అందంగా ఉంటుందని పెంచుకొంటారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్ కలదు. ఉత్తర్ప్రదేష్ నుంచి ఈ తాబేళ్ళ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఒక్క భారతదేశం నుంచే ఏటా 50000 తాబేళ్ళ వ్యాపారం జరుగుతున్నది.
ఎర్ర సాండ్ బొవా అనేకి ఒక విషరహిత పాము. ఇది లావుగా, మొద్దుగా ఉండే తోకతో ఉంటుంది. అదృష్టం ఇస్తుందనే ఉద్దేశంతో దీన్ని మంచం కింద ఉంచి నిద్రపోతారు.
వివిధ శంఖాలు మరియు సముద్ర కోరల్స్: అందమైన అలంకరణ వస్తువులు చేయటానికి శంఖాలు, కోరల్స్ వినియోగిస్తారు. అలా విచ్చలవిడిగా సేకరించటం వలన నాటిలస్, స్కార్పియన్ శంఖం వంటి జీవులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
No comments:
Post a Comment