వన్యప్రాణి సంపద అంతరించిపోవటానికి కల వివిధ కారణాలు
ఎ. ఆవాసాలను ధ్వంసం చేయుట
గృహనిర్మాణం, వ్యవసాయం, మైనింగ్, పరిశ్రమలు, రహదారుల నిర్మాణాలు, డామ్ ల నిర్మాణం వంటి వివిధ మానవ అభివృద్ధి కార్యక్రామల కొరకు అడవులను నరకటం జరుగుతుంది. అక్కడ నివసించే జంతుజాలం కొత్త పరిస్థితులకు అలవాటుపడటమో లేక మరో ప్రదేశానికి వలసపోవటమో జరుగుతుంది. ఈ ప్రక్రియలో మరికొన్ని జీవులు అంతరించిపోతాయి. మిగిలిన జీవులుకూడా కాలక్రమేణా తిండిదొరకక, వ్యాధుల వల్ల చనిపోతాయి.
సాగునీటి డామ్ ల నిర్మాణం: 1980-2000 ల మధ్య భారతదేశంలో వివిధ ప్రాంతాలలో నిర్మించిన 1877 చిన్న మరియు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వలన 4.5 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతం ముంపునకు గురయ్యింది. కోల్పోయిన అడవులను తిరిగి అడవులపెంపకం ద్వారా పునరుద్దరించటం జరగలేదు.
మధ్యప్రదేష్ లో నర్మదా వాలీ ప్రొజెక్టు కారణంగా 40000 హెక్టార్ల అటవీభూమి ముంపుకు గురయ్యింది. అక్కడ జరిగిన ఒక అధ్యయనంలో అక్కడ సుమారు 30% వన్య ప్రాణులు అంతరించిపోయినట్లు గుర్తించారు.
డామ్ ల నిర్మాణం వలన ఎగువజలాలలోకి వలస వెళ్ళే చేపలు నిలువరించబడతాయి. ఆకారణంగా ఆ చేపజాతులు ప్రత్యుత్పత్తి జరుపుకోలేక అంతరించిపోతాయి. నేపాల్ వద్ద నిర్మించిన హైడ్రోఎలక్ఱ్తిక్ ప్రొజెక్ట్ వల్ల – ఎగువజలాలలో ప్రత్యుత్పత్తి జరుపుకోవలసిన టార్, బంగారస్ వంటి చేపలు తమ ప్రత్యుత్పత్తి స్థలాలకు చేరలేకపోయేవి. ఆకారణంగా వాటి సంఖ్య ఈ మధ్య గణనీయంగా తగ్గిపోవటాన్ని గుర్తించారు.
వాణిజ్యపరమైన వన్యప్రాణి ఉత్పత్తులు: జంతుచర్మాలు, ఏనుగుదంతాలు, మాంసము, ఫర్ (బొచ్చు), మందులు, సుగంధాలు, సౌందర్యకారకాలు, అలంకరణ వస్తువులు వంటి అనేక అవసరాలకొరకు వన్యప్రాణులను చంపటం జరుగుతున్నది.
ఉదాహరణకు ఈ మధ్యకాలంలో ఆఫ్రికాలో 95% బ్లాక్ రైనో లు (నల్ల ఖడ్గమృగం) వాటి కొమ్ము కొరకు వేటాడబడ్డాయి. ఆ కొమ్ము నుండి తయారుచేసిన మందులు లైంగిక సామర్ధ్యము పెంపొందిస్తాయనే భావనతో, నల్లఖడ్గమృగంయొక్క కొమ్ముకు అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక్క కొమ్ము 25000 డాలర్ల విలువపలుకుతుంది.
గత10 సంవత్సరాలుగా మూడవవంతు ఆఫ్రికాఏనుగులను వేటాడి సుమారు 3000 టన్నుల ఐవరీ (ఏనుగుదంతం) ని అక్రమంగా విదేశాలకు తరలించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక కెజి ఐవరీ సుమారు 1000 డాలర్లు పలుకుతుంది. దీనిని ఎక్కువగా వినియోగించేది జపాన్, హాంకాంగ్, యు.ఎస్., జెర్మనీ, యు.కె వంటి దేశాలు. భారతదేశం ఐవరీ వ్యాపారాన్ని 1992లో నిషేదించింది.
సౌత్ అమెరికాలో ఒకప్పుడు విరివిగా సంచరించిన స్కార్లెట్ మకావ్ (ఒకరకమైన రామచిలుక) ఈరోజు దాదాపు అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఒసిలెట్, జాగ్వార్ వంటి పిల్లిజాతికి చెందిన జీవులను వాటి ఫర్ కొరకు నిరంతరాయంగా వేటాడటం వలన నేడు వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
ఒక్క 1962 సంవత్సరంలోనే సుమారు 70000 తిమింగలాలను వధించటం జరిగిందంటే వన్యప్రాణులను వేటాడటం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకొనవచ్చును. ప్రస్తుతం తిమింగలాల వేట పై ప్రపంచవ్యాప్తంగా నిషేదం ఉంది.
భారతదేశంలో, ఖడ్గమృగాలను వాటి కొమ్ముల కొరకు, ఏనుగులను దంతాలకొరకు, మస్క్ డీర్ ను(కస్తూరిమృగము) మస్క్
(కస్తూరి) కొరకు, మొసళ్ళను వాటి చర్మం కొరకు, పులులను చర్మం, గోళ్ళు, ఎముకల కొరకు, తోడేళ్ళు, నక్కలను ఎలుగుబండ్లను, పాములను చర్మంకొరకు వేటాడటం జరుగుతున్నది.
అంతర్జాతీయంగా కొన్ని వన్యప్రాణి ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ వల్ల భారతదేశంలో తొమ్మిది రకాల వన్యప్రాణుల సంఖ్య ప్రమాదకరస్థాయికి పడిపోయిందని CITES సంస్థ వెల్లడించింది.
వాటిలో ముఖ్యమైనవి ఫిన్ వేల్,(Balenoptera physalus) హిమాలయన్ మస్క్ (Moschus moschiferus),డీర్, ఆకుపచ్చ తాబేలు(Chelonia mydas), డిజర్ట్ మానిటర్ లిజర్డ్(Varanus griseus), యెల్లో మానిటర్ లిజర్డ్(Veranus flavescens) మరియు బెంగాల్ మానిటర్ లిజర్డ్(Veranus bengalensis)
ఓవర్ ఎక్స్ ప్లాయిటేషన్: చేపలను, కొన్నిరకాల మొలస్క్ లను, సీ కౌవ్స్, తాబేళ్ళను అవి ఏటాజరిపే పునరుత్పత్తి వేగంకన్న ఎక్కువసంఖ్యలో వేటాడటం వలన వాటిసంఖ్య తరిగిపోయింది. కొన్ని జాతులు అంతరించిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఉదా. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ గుడ్లను ఆహారంకొరకు విపరీతంగా సేకరించటం వల్ల వాటిసంఖ్య ప్రస్తుతం ప్రమాదకర స్థాయికిపడిపోయింది
రీసర్చ్ మరియు జంతుప్రదర్శనశాలలకొరకు వన్యప్రాణుల వినియోగం: జంతుప్రదర్శనశాలల కొరకు పరిశోధనల కొరకు వన్య ప్రాణులను వినియోగించటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. ఉదాహరణకు మానవునితో కల జన్యుమరియు శరీరధర్మశాస్త్ర సారూప్యత వలన, కోతులు, గొరిల్లాలను వైద్యపరిశోధనలలో విస్తారంగా వాడుకొంటున్నాము. దీనివల్ల ఆయాజీవుల సంఖ్య తరిగిపోతున్నది.
విదేశీ ప్రాణులను ప్రవేశపెట్టుట: విదేశీ ప్రాణులను మనప్రాంతాలలో ప్రవేశపెట్టటం వలన, స్థానికంగా నివసించే వన్యప్రాణులు ఆహారము మరియు ఆవాసాలకొరకు పోటీని ఎదుర్కోవలసిఉంటుంది. కొన్ని సందర్భాలలో విదేశీజీవులతో పోటీపడలేక అంతరించిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఉదా: గాలపాగస్ ద్వీపంనకు ఇరవయ్యవశతాబ్ద ప్రారంభంలో మేకలను ప్రవేశపెట్టారు. ఈ మేకలు అక్కడి పర్యావరణ వ్యవస్థలపై విపరీతమైన ప్రభావంచూపించింది. కొన్నిరకాల గడ్డిజాతులు అంతరించిపోయాయి. పక్షులు, తాబేళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడింది.
క్రిమిసంహారక మందుల వినియోగం: వ్యాధులను కలిగించే జీవులను ఉద్దేసించి వాడే కీటకనాశినులు, వాటిని మాత్రమే కాక వేరే ఇతర జీవులను కూడా చంపుతాయి. తద్వారా ప్రకృతిలో ఉండే ఉపయోగపడే జీవుల సంఖ్యకూడా తరిగిపోతుంది. ఇది ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంది.
వాతావరణ కాల్యుష్యము/విషప్రయోగం: సహజపర్యావరణ వ్యవస్థను కాలుష్యం నాశనంచేస్తుమ్ది. జలకాలుష్యం, నదులు, ఎస్చువరీల (ఉప్పునీటి ప్రవాహాలు) లో నివసించే జలచరాల మనుగడకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. జలాఅవాసాలలోకి విడుదల అయ్యే వ్యర్ధాలు (పారిశ్రామిక, మురికినీరు, ఎరువులు/కీటకనాశనులు ఉన్న వ్యవసాయ దిగుడునీరు) అక్కడి జీవరాశిపై ప్రభావం చూపి అవి అంతరించిపోయేలా చేస్తాయి.
ఆహారం మరియు వినోదం కొరకు వేటాడటం: జంతుమాంసం అధికప్రొటీన్ ను కలిగిఉంటుంది. ఆహారం కొరకు వన్యప్రాణులను వేటాడం జరుగుతుంది. దీనివల్ల వాటి సంఖ్య తగ్గిపోతున్నది. ముఖ్యంగా పక్షులు ఈ రకమైన చర్యలకు విపరీతంగా గురిఅవుతున్నవి.
జంతువులను వేటాడటం అనేది అనాదిగా ఉన్నతవర్గాలకు చెందిన ఒక క్రీడ. అలాచేయటం ధైర్యసాహసాలకు, గౌరవానికి, వీరత్వానికి ప్రతీకగా అనుకోవటం జరుగుతున్నది. తద్వారా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతున్నది.
ఇతరకారణాలు
ఎ. విస్తరణ పరిధి: కొన్ని జంతువులు పరిమిత ప్రాంతాలలో మాత్రమే విస్తరించి ఉంటాయి. అందుచేత ఒకవేళ అక్కడ వాటి ఆవాసం ఏకారణాలవల్లైనా నాశనం అయితే ఆ జీవులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది
బి. ఆహారపు గొలుసులో జీవి స్థానం: ఒక జీవి ప్రకృతిలోని ఆహారగొలులో చివరన ఉంటే (పులి సింహం, గద్దవంటివి) వాటి మనుగడ కష్టమౌతుంది
సి. ప్రత్యుత్పత్తి సామర్ధ్యము: తక్కువగా పునరుత్పత్తి జరుపుకొనే జీవులు తొందరగా అంతరించిపోవటానికి అవకాశాలు ఉంటాయి.
వన్యప్రాణులను ఎందుకు సంరక్షించాలి
ఎ. వన్యప్రాణులను సంరక్షించటం ద్వారా జీవవైవిధ్యాన్ని మరియు ప్రాణులు బ్రతకటానికి అవసరమైన నీరు, నేల మరియు వాతావరణనాన్ని సంరక్షించినవాళ్లమౌతాము.
బి. ప్రస్తుతం జీవిస్తున్న వన్యప్రాణులలో ఇంకా పూర్తిగా అధ్యయనం చేయబడని జీవజాతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉండే జీవవైవిధ్యం ద్వారా మానవజాతికి ప్రధానసమస్యలైన ఆహారము, రోగనివారణ వంటి అంశాలకు భవిష్యత్తులో పరిష్కారాలు లభించవచ్చు. కనుక ప్రస్తుతం వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
సి. వ్యవసాయరంగం, ఆక్వారంగాలలో ప్రస్తుతం మనం అనేక సహజసిద్దంగా లభ్యమౌతున్న జీవజాతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాము.
డి. నైతికంగా ఆలోచించినట్లయితే “ఈ భూమి మానవులకొరకు మాత్రమే లేదు, ఈ భూమిపై నివసించే హక్కు అన్ని జీవులకూ ఉంది” ఇతరప్రాణకోటి ఈ భూమిపై నివసించటానికి మన సహహక్కుదారులు.
ఇ. వన్యప్రాణులు ఒకరకంగా ఆర్ధిక వనరులు. కొన్నిదేశాలలో వైల్డ్ లైఫ్ టూరిజం అనేది ప్రధాన ఆదాయవనరు గాఉంది. వివిధ వనమూలికలనుండి అనేక ఔషదాలు తయారు చేయబడుచున్నవి. వాటికి ప్రపంచవ్యాప్తంగా మంచి వ్యాపారఅవకాశాలు ఉన్నవి
ఎఫ్. వినోదం కొరకు వన్యజీవులను వేటాడటం కూడా కొన్ని దేశాలకు చక్కని ఆదాయవనరు. విదేశాలలో వన్యప్రాణులను వేటాడటానికి అనుమతులివ్వటం ద్వారా మిలియన్ల డాలర్లు ఆర్జిస్తున్నవి
జి. సైంటిఫిక్ అధ్యయనాలలో వన్యప్రాణులను వినియోగించి అనేక కొత్త విషయములు తెలుసుకొనుచున్నారు. ఉదాహరణకు సీ అర్చిన్ పిండాభివృద్ది ని అధ్యయనం చేయటం ద్వారా మానవ పిండాభివృద్ధికి చెందిన అనేక నూతనవిషయాల ఆవిష్కరణలు చేసారు. రిసస్ కోతులపై ప్రయోగాల ద్వారా మానవరక్తవర్గాల గురించి అనేక కొత్తవిషయాలు తెలుసుకోగలిగారు. దుప్పి కొమ్ములపై అధ్యయనాల ద్వారా జీవులపై రేడియో ధార్మికత ప్రభావాలను అధ్యయనం చేయగలిగారు.
ఈ ప్రపంచంలో పిట్ట పాటలు, నెమలి నాట్యాలు, అందమైన పూల పరిమళాలు,అడవిలోకాసే అనేకరకాల పండ్లరుచులు వంటివి లేకపోతే ఎంతో రసవిహీనంగా అనిపిస్తుంది. జీవితం యాంత్రికంగా తయారవుతుంది.
No comments:
Post a Comment