5. సాత్వ, స్వాతంత్రత, స్వరాజ్య అనే మాటలను మీరు ఎలా అర్ధం చేసుకొంటారో వివరించుము
జ. మన అంతర్గతంగా ఉన్న సహజ స్వభావాన్ని సత్వ అంటారు. స్వీయ పరిశీలన ద్వారా మన సత్వ ను (సహజ స్వభావాన్ని) తెలుసుకొని దానిని నియంత్రించగలిగే విధంగా మార్చుకోవాలి ఇట్టి స్థితిని స్వనియంత్రణ లేక స్వతంత్ర అంటారు. స్వనియంత్రణ సాధించాక స్వీయపరిశీలన ద్వారా స్వయంప్రకటన లేక స్వరాజ్య స్థితి సాధించుకోవటమే మానవ జీవిత పరమార్ధము
6. సంపద అంటే ఏమిటి? వస్తు సంపదకు, సంపన్నులుగా ఉండటానికి మధ్య తేడా ఏమిటి?
జ. సంపద అంటే కావలసిన దానికంటే ఎక్కువ కలిగి ఉన్నామనే భావన. సంపదను వస్తు రూపంలో చూడటం చాలా సులభం. వస్త్రాలు, తిండి, రేడియో, టివి. కారు బైక్ వంటివన్నీ మన శరీరానికి సౌకర్యాన్ని కలిగించే బౌతిక వస్తువులు. శరీర సౌఖ్యానికి అవసరమైన వస్తువులను సరిపడా కలిగి ఉంటే మనం సంపదలను కలిగి ఉన్నట్లె.
సంపద కలిగి ఉన్నామని చెప్పటానికి ఈ రెండు విషయాలు అవసరం
ఎ. శారీరిక సౌకర్యాలు ఏమిటన్నవి సరిగ్గా తెలుసుకోవటం
బి. మనకు అవసరమైన సౌకర్యాల కంటే అధికంగా సంపాదించగల సామర్ధ్యం కలిగి ఉండటం (సంపాదన ఎక్కువగా ఉండటం)
మనకు శారీరిక సౌఖ్యాన్నిచ్చే వస్తువుల అవసరం ఉంది. కానీ అవి ఎంత స్థాయిలో అవసరమో మనం సరిగ్గా చెప్పలేము. సంపద అంటే కేవలం వస్తువులను కలిగి ఉండటమే కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ కాలంలో మనం ఈ వ్యత్యాసాన్ని గుర్తించటం లేదు. మనం ధనార్జనలో పడి, కుటుంబాన్ని, సమాజాన్ని ప్రకృతినీ దూరంచేసుకొంటాం. తద్వారా ధనమైతే మిగిలుతుంది కానీ శాంతి లభించదు. కనుక ముందుగా మనకు ఎంత ధనం, ఎంతమేరకు భౌతిక సౌకర్యాలు అవసరమన్నది గుర్తించాలి. లేకపోతే అడుగులేని గ్లాసులో నీళ్ళుపోసుకుంటూ పోవటమే అవుతుంది. ఎంత ప్రయత్నించినా ఆ గ్లాసులో నీళ్ళైతే నిండవు.
వస్తు సంపదకు, సంపన్నులుగా ఉండటానికి మధ్య తేడా: వస్తు సంపద వేరు, సంపన్నులుగా ఉన్నామనుకోవటం వేరు. ఉదా: ఒక మనిషిదగ్గర చాలా ధనం ఉంటుంది. కానీ అందులోంచి లేశమంతైన ఇతరులకు ఇవ్వటానికి అతనికి మనస్కరించటం లేదు. దీన్నే మరోలా చెప్పాలంటే ఆ మనిషికి సంపద ఉన్న భావన లేదు. ఎవరికైనా సంపన్నులమనే భావన ఉంటే వాళ్ళ దగ్గరున్నదానిని ఇతరులతో పంచుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకు కావలసినదానికంటే ఎక్కువే ఉందని వారు భావిస్తారు కనుక.
దీనిని బట్టి – ఎక్కువ ధనాన్ని కూడబెడుతూ కూడా లేనివాళ్ళలా భావించుకోవాలా? లేక అవసరమైనంత సంపాదించుకొని సంపద కలిగిన భావనలో ఉండాలా? అన్న రెండు ప్రశ్నలు వేసుకొంటే రెండవ విధంగా ఉండటమే ఉత్తమమైన మార్గమని గమనించాలి.
7. మానవుల మౌలిక మైన కోరికలు నెరవేరాలంటే కావలసిన వేమిటి? వాటి ప్రాధాన్యతలతో సహా వివరించండి?
జ. మానవుని మౌలికమైన కోరికలు- ఆనందం, సంపద. ఈ ఆనందం, సంపదలను ఈ క్రింది విధంగా పొందగలము
కోరికలు నెరవేరటానికి కావలసినవి
ఆనందం కానీ సంపద కానీ దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసుకోవటానికి ముందు మన కోరికలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఉదా; మనకోరికలు ఈ విధంగా ఉన్నాయని అనుకొందాం
పెద్దకారు, ఆనందం, తల్లిదండ్రులను బాగా చూసుకోవటం, మంచి లాప్ టాప్, కోపం లేకుండా ఉండటం, ప్రపంచశాంతి, గౌరవంగా బ్రతకడం, సొంత ఇల్లు, ఫస్టు రాంకు, డిజిటల్ కెమెరా, మంచి భోజనం, సంతృప్తి మొదలగునవి
పై లిస్టులో
పెద్దకారు, లాప్ టాప్, సొంత ఇల్లు, డిజిటల్ కెమేరా, మంచి భోజనం మొదలగునవి భౌతికంగా పొందగలిగేవి. వీటిని మనం శారీరిక సౌఖ్యాలు అని కూడా అంటారు.
కానీ ఆనందం, ప్రపంచ శాంతి, సంతృప్తి, కోపం లేకుండా ఉండటం, తల్లిదండ్రులను బాగా చూసుకోవటం వంటివి భౌతికంగా పొందగలిగేవి కావు. ఇవి మానసికమైనవి.
దీనిని బట్టి ఈ క్రింది ప్రతిపాదనలు చేయవచ్చును
ఎ. భౌతిక సౌకర్యాలు మానవులకు అవసరం
బి. భౌతిక సౌకర్యాలు మానవులకు, జంతువులకూ కూడా అవసరం
సి. జంతువుల కోరికలు భౌతిక సౌకర్యాలు పొందటంతో పూర్తయిపోతాయి (తిండి, నీడ వంటివి). కానీ మానవులకు అలా కాదు. బౌతిక సౌకర్యాలు అవసరమే కానీ ఇతని కోరికలు భౌతిక అవసరాలతో పూర్తయిపోవు. (మానసికమైన అవసరాలు కూడా తీరాలి). ఈ మానసికమైన అవసరాలు తీర్చుకోవటానికి మానవుని సంబంధాలు అవసరము.
సంబంధాలు అంటే తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడు, స్నేహితులు, గురువులు – వీళ్ళందరితోను మనకు సత్సంబంధాలు ఉండాలని కోరుకొంటాము. ఈ సంబంధాలలో ఎవరితోనైనా చెడిపోతే మనకు బాధ కలుగుతుంది.
డి. అంటే మనకు రెండు రకాల అవసరాలను గుర్తించాము. అవి. 1 సంబంధాలు 2. బౌతిక సౌకర్యాలు.
ఆనందం, సంపదలు కావాలంటే అవగాహన ఉండాలి
మనకు సరైన అవగాహన ఉన్నప్పుడే మనలను మనం, మనకున్న సంబంధాలను, మన బౌతిక అవసరాలను అర్ధం చేసుకోగలము. సరైన అవగాహన కలగాలంటే, ఎ. మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. బి. మన కుటుంబాన్ని, సమాజాన్ని అధ్యయనం చేయాలి. సి. మన ప్రకృతిని అధ్యయనం చేయాలి.
అంటే మన జీవితంలో మనం గడిపే వివిధ స్థాయిలను పరిశీలించాలి. అవి. 1. నాలో నేను జీవించటం 2. కుటుంబంతో జీవించటం 3. సమాజంలో జీవించటం 4. ప్రకృతిలో జీవించటం.
పై నాలుగు స్థాయిలలో మన జీవనాన్ని అర్ధం చేసుకొంటే మనకు జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నట్లే. సరైన అవగాహన ఉన్నప్పుడు సత్సంబంధాలను, సంపదలను సులభంగా పొందవచ్చును.
No comments:
Post a Comment