Friday, April 1, 2016

భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణా చరిత్ర

భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణా చరిత్ర

ప్రాచీన భారతదేశంలో మునుల ఆశ్రమాలసమీపంలో వన్యప్రాణులను వేటాడటం పట్ల నిషేదం ఉండేది. ఇది ఒకరకంగా పరోక్ష సంరక్షణ.

భారతదేశ ఇతిహాసాలు పురాణాలలో వివిధ జంతువులకు దైవత్వాన్ని ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు అనేక వన్యజీవులు వివిధదేవతలకు వాహనాలుగా ఉన్నాయి. దుర్గాదేవికి సింహం, పార్వతీదేవికి పులి, వినాయకునికి మూషికము, కుమారస్వామికి నెమలి వంటివి. అంతేకాక కోతి ఆంజనేయ స్వరూపమని, పాము సుబ్రహ్మణ్యేశ్వరుని రూపమని, గోవు పవిత్రజంతువనీ పూజలందుకోవటం వంటి చర్యలు పరోక్షంగా ఆయా జీవుల సంరక్షణ కు దోహదపడేవి

కీ.పూ మూడవశతాబ్దంలో చంద్రగుప మౌర్యుని పరిపాలనలో అడవులను సంరక్షించటానికి “కూప్యాధ్యక్షుడు” అనే పేరుతో అధికారి ఉండేవాడని చరిత్ర చెపుతున్నది. ఈ అధికారి అడవులను సంరక్షించుట, వేటను నియంత్రించుట వంటి పనులు చేయటం ద్వారా వన్యప్రాణి సంరక్షణ జరిగేది.

కౌటిల్యుని అర్ధశాస్త్రం లో అడవులను, వన్యప్రాణులను సంరక్షించటానికి అనేక చట్టాలు, అతిక్రమించిన వారికి విధించాల్సిన శిక్షలు కనిపిస్తాయి.

అక్బర్ పరిపాలనలో వ్యన్యప్రాణులను వేటాడటం విచ్చలవిడిగా జరిగింది. ఈయనకాలంలోనే వన్యప్రాణుల సంఖ్యతగ్గిపోతే, అనేకమంది వ్యక్తులు వలయాకారంలో ఏర్పడు డప్పులు వాయిస్తూ వన్యప్రాణులను ఒకచోటికి కేంద్రీకృతం చేసి వేటాడటం అనే పద్దతి మొదలైంది. దీనికారణంగా కూడా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోయింది. అప్పటికి భారతదేశం అంతటావిస్తరించి ఉన్న సింహాలు, ఖడ్గమృగాలు అక్బర్ కాలంలో కొన్నిప్రాంతాలకే పరిమితమైనాయి. చీటాలు పూర్తిగా భారతదేశం నుంచి అంతరించి పోయాయి.

జహంగిర్ కాలంలోవన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చట్టాలు చేయబడ్దాయి. వేట నిషేదించారు. ప్రత్యేక అనుమతితో మాత్రమే వేట జరిగేది.

బ్రిటిష్ పాలనప్రారంభంలో వన్యప్రాణుల వేట అవిచ్చిన్నంగా జరిగింది. అధికారులు, అతిధులకొరకు షికారీలు ఏర్పాటు చేసేవారు. వన్యప్రాణులను వేటాడటం ధైర్యసాహసాలకు, గొప్పతననానికి, ఉన్నతవర్గాలకు గౌరవచిహ్నంగా ఉండేది. వివిధ మహారాజులు, జమిందార్లు, నవాబులు కూడా అదెవిధంగా విచ్చలవిడి వేటను కొనసాగించారు. ఆకారణంగా పులులు, సింహాలు, ఖడ్గమృగాల సంఖ్య మరింత కుచించుకుపోయింది.

పంతొమ్మిదవశతాబ్దపు చివర్లో బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళు తెరచి వివిధ చట్టాలు చేసింది. 1879 లో ఏనుగుల సంరక్షణ చట్టం, 1912 నాటి వన్య జీవులు పక్షుల చట్టం, 1927 నాటి భారతదేశ అటవీచట్టం వంటివి భారతవన్యజీవుల వైవిధ్యతను కాపాడటానికి దోహదపడ్డాయి

ప్రముఖ వేటగాడు అయిన Jim Corbett కృషితో, 1936 లో భారతదేశపు మొట్టమొదటి జాతీయపార్కు అయిన “హైలీ జాతీయపార్కును” Hailey National Park” (దీనినే తరువాత జిమ్ కోర్బెట్ జాతీయపార్కుగా పేరు మార్చారు) ఏర్పాటు చేయటం జరిగింది.

స్వాతంత్ర్యానంతరం వన్యప్రాణి సంరక్షణ అవసరం గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణ కొరకు చట్టాలు, మార్గదర్శకసూత్రాలు తయారుచేయటానికి, భారతప్రభుత్వం 1952 లో Indian Wildlife Board ను స్థాపించింది. ఈ బోర్డు ఆధ్వర్యంలో అనేక జాతీయపార్కులు, అభయారణ్యాలు, గేమ్ పార్కులు

1970 లలో వచ్చిన రెండు ప్రధానమైన చట్టాలు, భారతదేశవన్యప్రాణి సంరక్షణ రంగాన్ని సమూలంగా మార్చివేసాయి. ఒకటి 1972 నాటి Wild Life Protection Act, రెండు 1973 నాటి అప్పటికి అతిపెద్ద సంరక్షణా పధమైన Project Tiger లు.

1980 లో వచ్చిన చిప్కో ఉద్యమం కూడా వన్యజీవుల సంరక్షణలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. చెట్లు నరకటాన్ని వ్యతిరేకిస్తూ, ఆ చెట్లను కౌగిలించుకొని అహింసాయుత మార్గం ద్వారా ప్రతిఘటించటం ప్రజలలో ఎంతో చైతన్యాన్ని, పర్యావరణం పట్ల అవగాహనను కల్పించింది.

1990 నుండి వన్యప్రాణుల సంరక్షణలో బయోటెక్నాలజీ, వన్యప్రాణి ఫొరెన్సిక్స్, టెలిమెట్రీ, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, సాటిలైట్ మేపింగ్ వంటి అధునాతన పద్దతులు వచ్చి ఈ రంగాన్ని సమూలంగా మార్చివేసాయి.

No comments:

Post a Comment