Tuesday, April 5, 2016

విదళనం

విదళన లక్షణాలు
ఎ. విదళనంలో సంయుక్త బీజం సైజు పెరగదు, కాని వాని లోని కణముల సంఖ్య విపరీతంగా పెరుగును.
బి. విదళనంలో జరిగే కణవిభజన వేగం, ఒక జీవి జీవిత చరిత్రలో మరెక్కడా జరగదు.
సి. కణముల సంఖ్య పెరగటం వలన DNA పరిమాణము పెరుగును
డి. విదళన సమయంలో కణవిభజనకు అవసరమైన శక్తిని ఇవ్వటానికి ఆక్సిజన్ వినిమయనం అధికమౌతుంది.
విదళన రేఖలు/అక్షాలు
విదళనం సంయుక్తబీజం పై ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ప్రారంభమౌతుంది. ఈ ప్రాంతంలో ఒక చీలిక ఏర్పడుతుంది. ఈ చీలికను విదళన చీలిక అంటారు. ఈ విదళన చీలిక లోతుగా విస్తరించటం వల్ల సంయుక్త బీజం రెండుకణాలుగా విడిపోతుంది. ఈ విదళన చీలిక ప్రధానంగా నాలుగు మార్గాలద్వారా విస్తరించవచ్చును. అవి.....
ఎ. ఆయత లేదా నిలువురేఖ: విదళన రేఖ అండం యొక్క రెండు దృవాల వైపు విస్తరించి మధ్య అక్షం గుండా ప్రయాణించి రెండు సమాన అర్ధభాగాలను ఏర్పరచును.
ఉదా: కప్ప, కోడి అండాలలో మొదటి రెండు విదళన చీలికలు
బి. ఆయత సమాంతర రేఖ: విదళన రేఖ ఆయత విదళనరేఖ కు సమాంతరంగా జరుగును. ఉదా: కప్ప, కోడి అండంలో మూడు, నాలుగు విదళనాలు
సి. అడ్డు రేఖ: అండం మధ్య భాగం నుంచి అడ్డుగా విస్తరించును. దీని ఫలితంగా అండం పైన క్రింద ఖండాలుగా విభజన జరుగును. ఉదా: ఉన్నత క్షీరదాలలో మొదటి విదళన రేఖ
డి. అడ్డు సమాంతర రేఖ: ఈ రకం విదళన రేఖ అడ్డు రేఖకు సమాంతరంగా జరుగును. ఉదా. కప్పలలో అయిదవ విదళన రేఖ

విదళనంలో రకాలు
అండంలో పీతకపదార్ధం అధికంగా ఉన్నప్పుడు, సొనపదార్ధం అధికంగా ఉన్న దృవమును బృహత్కంఢ దృవం అని, సొనపదార్ధం తక్కువగా ఉన్న దృవాన్ని జాంతవదృవమనీ అంటారు.
అండాల రకాలను బట్టి జంతువులలో ప్రధానంగా రెండురకాల విదలనాలు జరుగుతాయి
ఎ. పూర్ణభంజిత/సంపూర్ణ విదళనం: ఈ పద్దతిలో దాదాపు అండంలోని మొత్తం కణపదార్ధం, సొనపదార్ధం తో సహా విభజించబడుతుంది. ఇట్టి విభజన సమపీతక, మధ్యస్థ పీతక అండాలలో జరుగును. ఉదా: ఉభయచరాలు, ఆంఫియాక్సస్.

పూర్ణ భంజిత విదళనంలో ఏర్పడే బ్లాస్టోమియర్ల సైజుల ఆధారంగా ఇది మరల మూడు రకాలు.
• సమాన పూర్ణభంజిత విదళనం: ఈ విధానంలో విదళన చీలిక అండం మొత్తం విస్తరించి రెండు సమానమైన బ్లాస్టోమియర్లను ఏర్పరచును. ఉదా. అరేలియా, ఎఖైనోడెర్మేటా
• అసమాన పూర్ణభంజిత విదళనం: ఈ విధానంలో విదళనం ఫలితంగా ఏర్పడే బ్లాస్టోమియర్లు అసమానంగా ఉంటాయి. సూక్ష్మ ఖంఢాలు జాంతవదృవం వైపు, స్థూల ఖంఢాలు బృహత్కంఢ దృవంవైపు ఉంటాయి. ఉదా. ఆంఫియాక్సస్, ఉభయచరాలు

పూర్ణ భంజిత విదళనంలో ఏర్పడే బ్లాస్టోమియర్ల అమరిక ఆధారంగా ఇది మరల రెండు రకాలు.
• వలయ పూర్ణభంజిత విదళనం: ఈ విధానంలో ఏర్పడిన బ్లాస్టోమియర్ ల అమరిక వలయసౌష్టవాన్ని చూపును. ఉదా. కప్పలో మొదటి విదళనం ఆయతంగా జరిగి, అండం రెండు సమాన అర్ధభాగాలుగా ఏర్పడును. తరువాత రెండవ విదళనం ఆయతంగా మొదటిదానికి లంబకోణంలో (రైట్ ఏంగిల్) జరిగి నాలుగు సమాన బ్లాస్టోమియర్లు ఏర్పడును. మూడవ విదళనం అండం అడ్డంగా జరగటం వల్ల ఎనిమిది అసమాన బ్లాస్టోమియర్లు ఏర్పడును. వీటిలో జాంతవదృవంవైపు నాలుగు చిన్న సూక్ష్మఖండాలు, సొనపదార్ధం కల బృహత్కండదృవంలో నాలుగు స్థూల ఖండాలు ఉంటాయి. ఇవి ఒకదానిపై ఒక అమరి ఉండటం ద్వారా వలయసౌష్టవాన్ని చూపును
• సర్పిల పూర్ణ భంజిత విదళనం: ఈ విదళనం వలన ఏర్పడే బ్లాస్టోమియర్లు, దృవాలను కలిపే అక్షం వెంబడి సర్పిల ఆకారంలో అమరి ఉంటాయి. బ్లాస్టోమియర్లు కుడివైపు సర్పిలంగా అమరితే – డెక్స్ ట్రల్ సర్పిల విదళనం అని, ఎడమవైపుకు సర్పిలంగా అమరితే సినిస్ట్రల్ సర్పిల విదళనం అని అంటారు.
• ద్విపార్శ్వ పూర్ణభంజిత విదళనం: ఈ రకమైన విదళనంలో ఏర్పడే బ్లాస్టోమియర్లు అక్షానికి కుడి ఎడమవైపుల సమానంగా బింబప్రతి బింబాలు గా అమరుతాయి. ఆవిధంగా బ్లాష్టులా ద్విపార్శ్వసౌష్టవాన్ని ప్రదర్శించును.

బి. అసంపూర్ణ/అంతర్ భంజిత విదళనం: ఈ విధానంలో పీతకపదార్ధం ఉపరితలంపై జీవకణాల సముదాయం ఒక చిన్న్జ బిళ్ళ వలె తేలి ఉంటుంది. దీనిని బ్లాస్టో డిస్క్ అంటారు. విదళనం సొనపదార్ధాని వదిలి, ఈ బ్లాస్టో డిస్క్ ను చిన్న చిన్న కణాలుగా విభజించి పిండాన్ని ఏర్పరచును. ఇట్టి విదళనం సొనపదార్ధం అధికంగా ఉండే అండాలలో జరుగును ఉదా: చేపలు, సరీసృపాలు, పక్షులు. ఇది మరలా రెండు రకాలు
• చక్రాభ విదళనం: పీతక పదార్థంపై, కణపదార్ధం చిన్న బిళ్ళలాగ ఉండి (బ్లాస్టోడిస్క్) ఉంటుంది. విదళనం ఈ బ్లాస్టోడిస్క్ కు మాత్రమే పరిమితమై ఉండును. పీతకపదార్ధం విదళనం చెందదు. ఉదా: చేపలు, పక్షులు
• ఉపరితల అంతర్ భంజిత విదళనం : ఈ విదళనం కేంద్ర పీతక అండాలకు ప్రత్యేకము. ఇట్టి అండాలలో కణపదార్థం ఉపరితలానికే పరిమితమై ఉంటుంది. అందుచే విదళనం కూడా ఉపరితలానికే పరిమితమౌతుంది. మధ్య ప్రాంతంలో కల పీతకపదార్థం విదళనం చెందదు. ఉదా: కీటకాలు

బ్లాస్టోమియర్ ల భవిష్యత్తును బట్టి విదళనాలను రెండురకాలుగా విభజించారు
• నిర్ధారిత విదళనం: ఈ విదళనం ద్వారా ఏర్పడిన బ్లాస్టోమియర్ ల భవిష్యత్తు ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అంటే అండము 4 లేక 8 కణముల దశలొ ఉన్నప్పుడే ఆ యా కణములు భవిష్యత్తులో ఏ యే అవయవాలను ఏర్పరగలవో నిర్ధారణ జరిగిపోతుంది. ఈ కణాలలో ఏ ఒక్క కణమైన నశించినట్లయితె, ఆ అవయవము ఏర్పడదు. ఉదా: అన్నిలిడా, మొలస్కా
• అనిర్ధారిత విదళనం: విదళనం ద్వారా ఏర్పడే బ్లాస్టోమియర్ ల భవిష్యత్తు ముందుగానే నిర్ణయించబడక పోయినట్లయితే అట్టి విదళనాన్ని అనిర్ధారిత విదళనం అంటారు. అండము 4 లేక 8 కణముల దశలొ ఉన్నప్పుడు ఏ ఒక్క కణమైనా నశించినట్లయితే, అవితిరగి ఏర్పడతాయి. అవయవోత్పత్తి సమస్య రాదు. ఉదా: సకశేరుకాలు

విదళనం ద్వారా కణజాలము, అవయవాలు ఏర్పడటానికి అవసరమైన స్థాయిలో కణాలు ఏర్పడటం జరుగుతుంది. విదళనం అనేది పిండ స్వరూపం ఏర్పడే వరకూ జరుగుతుంది. తదనంతరం అలా ఏర్పడిన కణాలు అవయవాలుగా ఏర్పడి, పరిమాణాన్ని పెంచుకొని పూర్తి పిండాన్ని ఏర్పరచును.

1 comment: