Tuesday, October 4, 2016

బీజకణోత్పత్తి

1. బీజకణోత్పత్తి గురించి వ్యాసం వ్రాయుము
జ. శుక్ర జననం, అండజననాలను కలిపి బీజకణోత్పత్తి అంటారు. పురుషజీవులలో శుక్రజననం, స్త్రీ జీవులలో అండజననం జరుగుతుంది.
బీజకోశములలో ఉండే జనన కణాలు విభజన చెంది, స్త్రీలలో అండములు పురుషులలో శుక్రకణములను ఏర్పరచును. ద్వయస్థితిక క్రోమోజోముల సంఖ్యను (2X) కలిగిఉన్న జనన కణాలు క్షయకరణ విభజన ద్వారా ఏక స్థితిక (X) క్రోమోజోముల సంఖ్యను కలిగిన బీజకణాలను ఏర్పరచును.

I శుక్ర జననం
పురుషబీజకణాలు లేదా శుక్రకణాలు ఏర్పడే విధానాన్ని శుక్రజననం అంటారు. ఇది ముష్కంలో జరుగును. ముష్కం నిర్మాణంలో పొడవైన శుక్రోత్పాదక నాళికలు మెలికలు తిరిగి ఉంటాయి. వీటిమధ్య కల ఖాళీలలో రక్తకేశనాళికలు, సంయోజకకణజాలము, నాడులు, లీడిగ్ కణములు ఉంటాయి. ఈ లీడిగ్ కణములు పురుష లైంగిక హార్మోనులను (టెస్టోష్టిరాన్) ఉత్పత్తి చేసి, ద్వితీయలైంగిక లక్షణములు ఏర్పడటానికి దోహదపడును. శుక్రోత్పాదక నాళికల గోడలలో కల జనన కణములు విభజనలు జరుపుకొని శుక్రకణములను ఉత్పత్తి చేయును. ఈ జనన కణముల మధ్య కల ప్రత్యేకమైన కణములైన సెర్టోలి కణములు శుక్రకణముల ఉత్పత్తి అవసరమైన పోషకములను అందించును.

శుక్రకణ జననాన్ని రెండు దశలుగా విభజించవచ్చును. అవి. ఎ. శుక్రకణోత్పాదన కణము ఏర్పడుట బి. శుక్రకణోత్పాదక కణము శుక్రకణముగా ఏర్పడుట
ఎ. శుక్రకణోత్పాదన కణము ఏర్పడుట:
శుక్రకణోత్పాదన కణము మూడు దశలుగా జరుగును. అవి ఎ. కణ విభజన దశ బి. పెరుగుదల దశ సి. పరిణిత దశ
విభజన దశ: శుక్రోత్పాదనాళికల బాహ్య ఉపరితలముపై జననకణాలు ఉంటాయి. ఈ కణాలను ప్రాధమిక బీజకణాలు లేదా శుక్రమాతృకణాలు అంటారు. ఇవి అనేక విభజనలు జరుపుకొని శుక్రకణ మాతృకణాలుగా మార్పు చెందుతాయి. ప్రతి శుక్రకణ మాతృ కణాలు ధ్వయస్థితిక క్రోమోజోములను కలిగి ఉంటాయి. ఈ దశ శిశువు పిండదశలో మొదలయి మరల యుక్తవయసు వచ్చే వరకూ సాగుతుంది.

పెరుగుదల దశ: జీవి యుక్తవయసుకు చేరాకా ప్రతి శుక్రకణ మాతృకణములు తన చుట్టూ ఉన్న సెర్టోలి కణములనుండి ఆహార పదార్ధములను గ్రహించి పెద్దవవుతాయి. వీటిలోని క్రోమోజోములు నాలుగు జతల క్రొమాటిడ్ లను ఏర్పరుచుకొని తదుపరి దశ అయిన క్షయకరణ విభజనకు తయారుగా ఉంటాయి.

పరిణిత దశ: ఈ దశలో ఒక్కొక్క కణం క్షయకరణ విభజన జరుపుకొని నాలుగు ఏకస్థితిక చలన రహిత శుక్రకణాలను ఏర్పరుస్తుంది. మొదటి క్షయకరణ విభజన వలన రెండు ఏకస్థితిక ద్వితీయ శుక్రమాతృకణాలు ఏర్పడును. క్షయకరణ విభజన II వలన ఒక్కో ద్వితీయ శుక్రమాతృకణము రెండు ఏకస్థితిక శుక్రకణాలను ఏర్పరచును. ఇవి తదుపరి విభజనలు జరుపుకొనక, విభేధీకరణ చెంది చలించగలిగే స్పెర్మ్ లేదా శుక్రకణముగా మారును
బి. శుక్రకణోత్పాదకము - చలించే శుక్రకణము ఏర్పడుట
చలన రహిత శుక్రకణాలు (స్పెర్మాటిడ్ లు) చలన సహితంగా, క్రియాశీలకంగా మారటాన్ని శుక్రకణోత్పాదకము లేదా స్పెర్మియోజెనిసిస్ అంటారు.
ఫలదీకరణ సమయములో అండమును చేరి దానితో సంయోగము చెందుట శుక్రకణము యొక్క ప్రాధమిక విధి. ఆ విధిని నిర్వర్తించుటకొరకై శుక్రకణము యొక్క నిర్మాణములో ఈ క్రింది మార్పులు జరుగును.
ఎ. కేంద్రకములో జరుగు మార్పులు: ఈ దశలో శుక్రకణోత్పాదక కేంద్రకం ద్రవాన్ని పోగొట్టుకొని చిన్నదవుతుంది. క్రోమోజోములు కూడా సూక్ష్మ రూపంలోకి వస్తాయి.
బి. ఎక్రోసోము ఏర్పడుట: శుక్రకణ పూర్వాంతమున ఒక టోపీ ఆకారపు నిర్మాణము ఏర్పడుతుంది. దీనిని ఎక్రోసోము అంటారు. ఇది గాల్జి దేహమునుండి ఏర్పడుతుంది. గాల్జి పదార్ధము కళికగా మారి, తనలోని ద్రవమును పోగొట్టుకొని కేంద్రకము యొక్క పైభాగాన్ని కప్పుతుంది. దీనినే కేంద్రక పూర్వఛత్రకము లేక ఎక్రోసోము అంటారు. ఎక్రోసోమునందుకల ఎంజైములు, అండము యొక్క పై త్వచ మును కరిగించి, శుక్రకణ కేంద్రకము అండములోకి ప్రవేశించటంలో తోడ్పడును
సి. తారావత్కేంద్రాలు (సెంట్రియోల్స్): సెంట్రోజోములోని రెండు తారావత్కేంద్రాలో మొదటిది శుక్రకణ మెడ మరియు మధ్య తునకలను ఏర్పరచును. దీనిని సమీపాగ్ర తారావత్కేంద్రము అంటారు. రెండవ తారావత్కేంద్రము అక్షీయ తంతువును కలిగ్ ఇది శుక్రకణిం తోకను ఏర్పరచును. ఇది 9+2 అమరికను కలిగి ఉండును.
డి. మధ్యభాగము: శుక్రకణము మధ్య భాగములో మైటోఖాండ్రియాలన్నీ కేంద్రీకృతమై ఫలదీకరణ సమయములో శుక్రకణము చలించటానికి అవసరమైన శక్తిని అందచేస్తాయి.
ఇ. పరిణితి చెందిన శుక్రకణము: పరిణితి చెందిన శుక్రకణము లో శీర్షము (హెడ్) భాగములో అక్రోజోమ్, కేంద్రకము - మధ్యభాగము(మిడిల్ పీస్) లో రెండు సెంట్రియోల్ లు మరియు తోక లేద కశాభము అను భాగములతో ఉండును

II అండజననం
స్త్రీబీజకోశములోని జననస్థరపు కణాలు అండములుగా అభివృద్ధి చెందటాన్ని అండజననము అంటారు.
సకశేరుకములలో ఒక జత స్త్రీ బీజకోశములు ఉంటాయి. స్త్రీబీజకోశపు ఉపరితలం పై ఉపకళా కణజాలంతో ఒక పొర ఏర్పడును దీనిని జననోపకళ అంటారు. ఈ జనన ఉపకళా కణాలు సమవిభజనలు చెంది చిన్న చిన్న గుంపులు గుంపులుగా కణముల సముదాయములను ఏర్పరచును. ఒక్కొక్క గుంపును గ్రాఫియన్ పుటిక అంటారు. ఒక గ్రాఫియన్ పుటికలో బాగా అభివృధ్ది చెందిన ఒక కణము “అండ మాతృకణముగా” ఏర్పడును. మిగిలిన కణాలు ఈ అభివృద్ది చెందే అండానికి పోషకపదార్ధములను అందించును. ఇలా పరిణితిచెందిన గ్రాఫియన్ పుతిక అండాశయం ఉపరితలానికి చేరి పగిలిపోవటం ద్వారా అండం విడుదల జరుగును. ఈ రకంగా అండాశయం నుండి నుండి అండం విడుదల కావటాన్ని అండోత్సర్గము/అండోత్పత్తి అంటారు.
ఈ ప్రక్రియ మూడు దశలలో జరుగును అవి. ఎ. విభజన దశ బి. పెరుగుదల దశ సి. పరిణిత దశ
విభజన దశ; ఇందులో స్త్రీబీజకోశంలోని జననోపకళ కణాలు అనేక సమవిభజనలు జరుపుకొని ఎక్కువ కణాలను ఏర్పరచును. ఈ కణాలను అండమాతృకణాలు అంటారు. ఇవి కూడా అనేక విభజనలు జరుపుకొని ప్రాధమిక అండమాతృకణం ఏర్పడుతుంది. ఈ దశ వరకూ గల కణాలు అన్నీ ద్వయస్థితిలో ఉంటాయి.
వృద్ధి/పెరుగుదల దశ: ప్రతి అండమాతృకణం ప్రొటీన్ క్రొవ్వులను సొనపదార్ధ రూపం లో ఎక్కువగా సేకరించుకొంటుంది. ఈ సొనపదార్ధం అండంలోని క్రిందిభాగంలో ఎక్కువగా కేంద్రీకృతమౌతుంది, కనుక ఈ భాగాన్ని భృహుత్కంఢ దృవం అనీ దానికి వ్యతిరేకంగా దిశలో ఉన్న భాగాన్ని జాంతవ దృవమనీ అంటారు. సొనపదార్ధాన్ని పూర్తిగా ఏర్పరచుకొన్న అండమాతృకణాన్ని, ప్రాధమిక అండమాతృకణం అంటారు.
పరిపక్వ దశ: ప్రాధమిక అండమాతృకణం మొదటి క్షయకరణ విభజన రెండు అసమాన కణాలుగా ఏర్పడుతుంది. పెద్దకణాన్ని ద్వితీయ అండమాతృకణం అనీ, చిన్నకణాన్ని దృవకణం అని అంటారు. ఇవి ఏకస్థితికాలు. ఇది మరల విభజన జరుపుకోగా ఏర్పడే పెద్దకణాన్ని పరిపక్వ అండము లేదా గుడ్డు అంటారు. మొదటి మరియు రెండవ దృవదేహాలు అదృశ్యమవుతాయి.
అలా ఉత్పత్తి అయిన అండాలు అండోత్పత్తి అనే ప్రక్రియ ద్వారా అండాశయము వెలుపలకు విడుదల చేయబడును.

No comments:

Post a Comment