2. ఫలదీకరణం ను విశదీకరింపుము
జ. స్త్రీ బీజకణం మరియు పురుష బీజకణముల కలయికను ఫలదీకరణం అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో ఫలదీకరణ ముఖ్యమైన క్రియ. ఇందులో రెందు ఏకస్థితిక కణాలైన అండము మరియు శుక్రకణములు కలయిక వల్ల ద్వయస్థితిక సంయుక్త బీజము ఏర్పడుతుంది. సంయుక్తబీజం పిండంగా మారి పిల్ల జీవిగా వృద్ధి చెందుతుంది.
ఫలదీకరణ జంతువుల శరీరం వెలుపల జరిగితే బాహ్యఫలదీకరణం (కప్ప) అని, శరీరం లోపల జరిగితే అంతరఫలదీకరణ అని (మానవుడు) అంటారు. బాహ్య ఫలదీకరణంలో శుక్రకణాలు మరియు అండాలను పరిసరాల మాధ్యమం లోకి విడుదల చేయ బడతాయి. శుక్రకణం అండమును చేరి ఫలదీకరణ జరుపుతుంది. అంతర ఫలదీకరణలో పురుష జీవి తన శుక్రకణాలను స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోనికి ప్రవేశపెడుతుంది. తరువాత శుక్రకణము చురుకుగా కదులుతూ అండమును చేరుకొని ఫలదీకరణ జరుపును.
కొన్ని సందర్భములలో శుక్రకణాలు కొన్ని రసాయినిక పదార్ధముల ప్రభావముచేత అండముల వద్దకు చేర్చబడతాయి
ఫెర్టిలైజిన్ మరియు యాంటి ఫెర్టిలైజిన్
శుక్రకణములను ఆకర్షించు పదార్ధమును ఫెర్టిలైజిన్ అంటారు. ఇది పక్వము పొందిన అండములనుండి ఎక్కువమొత్తాలలో విడుదల చేయబడుతుంది. ఇది అండముల పరిసర మాధ్యమము లోకి (నీరు లేదా కణబాహ్య ద్రవాలు) స్రవింపబడి, సమీపములో నున్న శుక్రకణములను తనవైపునకు ఆకర్శించును.
శుక్రకణము ఉపరితలముపై యాంటి ఫెర్టిలైజిన్ అను పదార్ధమును కలిగిఉంటుంది. ఫెర్టిలైజిన్ – యాంటిఫెర్టిలైజిన్ అణువులు ఒకదానితొ ఒకటి బంధనము ఏర్పరచు కొనటం ద్వారా శుక్రకణము అండముల ప్రాధమిక కలయిక జరుగుతుంది.
కెపాసిటేషన్: శుక్రకణం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మార్గములో ప్రవేసించిన తరువాత, దాని ఉపరితల త్వచములో కల ప్రొటీన్ల నిర్మాణంలో మార్పు వస్తుంది. అప్పుడు మాత్రమే ఇది, అండము యొక్క వెలుపలి పొర అయిన జోనా పెల్లుసిడా ను చొచ్చుకు పోగలిగే సామర్ధ్యాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియను కెపాసిటేషన్ అంటారు.
శుక్రకణము అండములో ప్రవేశించుట: శుక్రకణం అండాన్ని చేరగానే దాని లోని ఎక్రోసోము లైసిన్ అనే ఎంజైమును స్రవించి అండం యొక్క వెలుపలి పొర అయిన జోనా పెల్లుసిడాను కరిగించును. తరువాత ఎక్రోసోము సాగి సన్నని పొడవైన నాళిక వలె ఏర్పడును. దీనిని ఎక్రోసోమల్ తంతువు అంటారు. ఇది అండములోనికి చొచ్చుకొని పోవును.
అండము ఉత్తేజమును పొంది ప్రతిచర్యను చూపుట: ఎక్రోసోమల్ తంతువు అండమును తాకగానే అండము యొక్క ఉపరితలము ముందుకు సాగి శంకువు వంటి ఫలదీకరణ కొన ను ఏర్పరచును. ఇది హయలిన్ అనబడు పదార్ధముతో ఏర్పడును. ఈ ఫలదీకరణ కొన ముందుకు విస్తరించి శుక్రకణమును తనలోనికి లాక్కొనును. తరువాత నెమ్మది నెమ్మదిగా ఫలదీకరణ కొన లోనికి ముడుచుకు పోవును.
పాలిస్పెర్మీ నిరోధము: సాధారణంగా అండములోనికి ఒక శుక్రకణము మాత్రమే ప్రవేశిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ శుక్రకణాలు ప్రవేసించటాన్ని పాలిస్పెర్మ్య్ అంటారు. అలాంటి పరిస్థితులలో అట్టి అండములోని పిండము అభివృద్ది చెందక నశించిపోవును. కనుక ఒక శుక్రకణము ప్రవేశించిన తరువాత అండత్వచాలలో అనేక బౌతిక రసాయినిక చర్యలు జరిగి, మరొక శుక్రకణము లోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
ప్రాక్కేంద్రకాల కలయిక: అండంలో ప్రవేశించిన వెంటనే శుక్రకణం తల లావెక్కి పురుష ప్రాక్కేంద్రకం గా మారుతుంది. అదే సమయంలో అండంలోని కేంద్రకం చివరి పరిపక్వ విభజన జరుపుకొని ఫలదీకరణకు సిద్దమౌతుంది. అండకేంద్రకాన్ని స్త్రీ ప్రాక్కేంద్రకం అంటారు. ఈ రెండు కేంద్రకాలు క్షయకరణ విభజన ద్వారా ఏర్పడినవి కనుక వీటిలో ఏకస్థితిక క్రోమోజోములు ఉంటాయి. ఈ రెండుక్రోమోజోముల కలయిక వలన ఏర్పడే సంయుక్తబీజం ద్వయస్థితిక స్థితిని పొందుతుంది.
శుక్రకణ కేంద్రకం (పురుషకేంద్రకం) స్త్రీ కేంద్రకాన్ని చేరుకొనే మార్గాన్నిశుక్రకణ మార్గం అంటారు. స్త్రీ ప్రాక్కేంద్రకం కూడా పురుషకేంద్రకాన్ని చేరటానికి కొంతదూరం ప్రయాణిస్తుంది. ఇవి రెండు తమ కేంద్రక త్వచాలను కరిగిపోయి, పిత్రు మరియు మాతృ క్రోమోజోములు రెండు పక్కపక్కకు చేరి సమవిభజనకు (అండం విభజనలు జరుపుకొని పిండాన్ని ఏర్పరచును) సిద్దమవుతాయి. ఫలదీకరణ సమయంలో జరిగే కేంద్రక పదార్ధముల కలయిక వలన పితృ మరియు మాతృ లక్షణాలు కలిసిపోతాయి. స్త్రీ మరియు పురుష ప్రాక్కేంద్రకాల కలయిక అనంతరం అండాన్ని సంయుక్త బీజం అంటారు.
సంయుక్త బీజములో క్రోమోజోముల నిడివి పెరుగుతుంది, మైటోఖాండ్రియాల సంఖ్య పెరుగును, కేంద్రకాంశము పెద్దదగును. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జి, సెంట్రోజోములు అదృశ్యం అవుతాయి. ప్రొటీన్లు, కొవ్వులు, గ్లైకోజెన్ వంటి ఆహారపదార్ధలతో తయారయ్యే సొనపదార్ధం అండములో నిక్షిప్తం చేయబడుతుంది. ఫలదీకరణమ్ జరిగిన వెంటనే విదళనం మొదలౌతుంది.
No comments:
Post a Comment