చేపలకు సోకు వివిధ వ్యాధులు, వాటి లక్షణములు మరియు చికిత్స లను తెలుపుము
జ. చేపల పెంపకం విజయవంతమవ్వాలంటే పాటించవలసిన యాజమాన్యపద్దతులలో వాటికి వచ్చు వ్యాధులు, వాటి నివారణ మరియు చికిత్స పద్దతుల గురించిన అవగాహన చాలా చాలా అవసరము.
అప్పుడు మాత్రమే మంచి దిగుబడులు వచ్చి అధిక లాభాలను పొందవచ్చును.
వ్యాధి కల చేపలను గుర్తించుట
ఎ. వ్యాధి సోకిన చేపలు, చురుకైన కదలిక లు ప్రదర్శించవు. సమతాస్థితిని కోల్పోతూ, నీటి అడుగుకు చేరును
బి. దేహ రంగు మారిపోవును
సి. చర్మముపై
శ్లేష్మము అధికముగా స్రవించబడును
డి. శరీర కుహరములో నీరు చేరును
ఇ. దేహముపై కంతులు, వాపులు, పుండ్లు కనిపించును.
పై లక్షణములను బట్టి ఆ చేపలు ఏదో వ్యాధి బారిన పడినవని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
చేపలకు వచ్చు వ్యాధులు రెండు రకములు ఎ. పరాన్న జీవుల వలన కలుగు వ్యాధులు
బి. పరిసరాల వలన కలుగు వ్యాధులు
పరాన్నజీవుల వలన కలుగు వ్యాధులు
పరాన్న జీవుల వలన కలుగు వ్యాధులను తిరిగి ఎ. వైరల్ వలన కలుగు వ్యాధులు బి. బాక్టీరియల్ వలన కలుగు వ్యాధులు సి. ఫంగస్ వలన కలుగు వ్యాధులు డి. ప్రొటోజోవన్ ల వలన కలుగు వ్యాధులు
ఇ. హెల్మెంథ్ ల వలన కలుగు వ్యాధులు
ఎఫ్. వలన కలుగు వ్యాధులు
అని వివిధ రకాలుగా విభజించవచ్చును.
వైరస్ ల వలన కలుగు వ్యాధులు:
చేపలకు వచ్చే వ్యాధులలో వైరస్ ల ద్వారా వచ్చే వ్యాధులు రైతుకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి.
వీటిని గుర్తించటం చాలా కష్టం. మందుల ద్వారా నయంకావు.
నివారణ ఒకటే మార్గము.
ఎ. వైరల్ హెమరేజ్ సెప్టిసీమియ. (VHS) ఈ వైరల్ జబ్బు సోకిన చేపలు చూట్టానికి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా మరణానికి గురవుతాయి.
ఈ వ్యాధి సోకిన చేపలలో కాలేయము, మూత్రపిండాలు గురవుతాయి.
చేపలు తిండిమానివేసి, నీటిలో వింత కదలికలను ప్రదర్శిస్తాయి.
మొప్పలు పాలిపోయి క్రమంగా ఊదారంగుకు మారుతాయి.
పొట్ట,పేగు ఎర్రబడి వాచిపోతాయి.
శరీరకుహరంలో దుర్వాసన కలిగించు పసుపుపచ్చని ద్రవం చేరుతుంది. చర్మము మీద పుండ్లు ఏర్పడతాయి.
మొప్పలు పాలిపోయి, చనిపోయేనాటికి ఊదారంగుకు మారుతాయి.
చికిత్స: ఈ వ్యాధికి తగిన చికిత్స లేదు.
జబ్బుపడిన వాటిని చనిపోయినవాటిని చెరువునుండి ఏరివేయాలి.
ఆహారం ఎక్కువగా వేయరాదు.
బి. ఇన్ ఫెక్టివ్ పాంక్రియాటిక్ నెక్రోసిస్ (IPN) ఈ వైరస్ వలన అకస్మాత్తుగా చేపలు మరణిస్తాయి. ఈ వ్యాధిసోకిన చేపలు గుండ్రంగా తిరుగుతూ వేగంగా ఈదుతూ చెరువు అడుగుకు చేరి చనిపోతాయి. కళ్ళు ఉబ్బి, పేగులో తెల్లని ద్రవం పేరుకొంటుంది. కాలేయం నెక్రోసిస్ (కుళ్ళి పోవటం) కి గురవుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.
సి. ఇన్ ఫెక్షన్ హిమటోపాయిటిక్ నెక్రొసిస్ (IHN) ఈ వ్యాధి సోకిన చేపలలో మూత్రపిండాలలో రక్తకణాలు ఉత్పత్తి చేసే కణజాలం నాశనమౌతుంది.
మొప్పలు పాలిపోవటం వాజాల మొదళ్ళు ఎర్రబడటం, శరీరం రంగు నల్లగా మారటం, పొట్టవాపు మొదలగునవి వ్యాధిలక్షణములు. ఈ వ్యాధికి చికిత్స లేదు.
డి. గాలితిత్తి వ్యాధి:కార్ప్ చేపలలోఈ వైరల్ వ్యాధిని గుర్తించటం జరిగింది. అన్ని వయసుల చేపలకు ఈ వ్యాధి వస్తుంది.
గాలి తిత్తి గోడలు (వాయుకోశం) గట్టిపడి, సీరం ద్రవపదార్ధాలు అధికంగా చేరటం వలన తిత్తి వ్యాకోచం చెంది పనిచేయకుండా అయిపోతుంది.
తద్వారా చేపమరణం సంభవిస్తుంది.
ఇ. పాపిల్లోమాటోసిస్:
దీనినే కాలిఫ్లవర్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన చేపల నోటి చుట్టూ తెల్లని కంతులు ఏర్పడతాయి. నోరు కాలిఫ్లవర్ వలె కనిపిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.
జబ్బుపడిన వాటిని చనిపోయినవాటిని చెరువునుండి ఏరివేయాలి.
చేపలకు సోకు వివిధ బాక్టీరియల్ వ్యాధులు
వివిధరకములైన బాక్టీరియం లు చేపలలో అనేక రకములైన వ్యాధులనుకలిగించును.
ఎ. దూదిపింజె వ్యాధి (Cotton Mouth
disease): ఫ్లెక్సి బాక్టీరియా అనే ఓ తంతురూప బాక్టీరియం వలన ఈ వ్యాధి కలుగును. నోటిచుట్టూ తెల్లని దారాల వంటి నిర్మాణాలు దూదిపింజె వలె పెరుగును. క్లోరంఫినకాల్ వంటి ఆంటిబయాటిక్ లను 10ppm మోతాదులో నీటిలో చల్లుట ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చును.
బి. పుచ్చ మరియు వాజ విచ్చిత్తి వ్యాధి (Tail and gill rot) నీటిలో కుళ్ళుతున్న పదార్ధములు ఎక్కువగా ఉన్నచో ఈవ్యాధి చెలరేగును. ఇది ఎరోమోనాస్ వంటి బాక్టీరియం వలన కలుగును. ఈ వ్యాధి వచ్చిన చేపల వాజములు మరియు పుచ్చముల కణజాలము విచ్చిన్నమై ఆ భాగములు పెళుసుబారి విరిగిపోవును. ఈ వ్యాధి ప్రారంభదశలలో వాజముల అంచులవెంబడి తెల్లని రేఖలు ఉండటాన్ని గమనించవచ్చును.
చికిత్స ఈ దశలో అట్టి చేపలను 0.5% కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణము నందు రెండు నిముషములుంచుట ద్వారా వ్వ్యాధిని నివారించవచ్చును.
సి. డ్రోప్సీ/జలోదర వ్యాధి. ఇది సూడోమోనాస్ పంక్టేటా బాక్టీరియం వల్ల కలుగును. ఇందులో శరీరకుహరములో పసుపుపచ్చని ద్రవం పేరుకొనిపోయి, చేపల పొలుసులు బుడిపెలుగా పొడుచుకువచ్చును. ఆంత్రము, కాలేయము, మూత్రపిండములలో వాపు, మిడిగుడ్లు వంటివి ఇతర లక్షణములు.
చికిత్స ఆక్సిటెట్రాసైక్లిన్ వంటి ఆంటిబయాటిక్ లను ఆహారములో కానీ ఇంజక్షనుద్వారా కానీ ఇచ్చినచో వ్యాధి నయం అవుతుంది. ప్రారంభదశలలో 0.5% - 2% కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణము నందు రెండు నిముషముల చొప్పున 5 రోజుల పాటు ద్వారా వ్వ్యాధిని నివారించవచ్చును.
డి. ఫ్యూరంకులోసిస్: క్రుళ్ళుతున్న పదార్ధములు చెరువులో ఎక్కువగా పేరుకుపోయినచో ఈ వ్యాధి చెలరేగును.
ఇది ఏరోమోనాస్ సాల్మొనిసిడా అనే బాక్టీరియం వలన కలుగును. చర్మముపై పుళ్ళు, బొబ్బలు, నీటిపొక్కులు, చీము చేరుట వంటివి లక్షణములు. చెరువును శుభ్రముగా ఉంచుకొనుట ద్వారా ఈ వ్యాధినినివారించవచ్చును.
చికిత్స: ప్రారంభదశలలో 0.5% - 2% కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణము నందు రెండు నిముషముల చొప్పున 5 రోజుల పాటు ద్వారా వ్వ్యాధిని నివారించవచ్చును.
ఇ. కాలమ్నారిస్ లేక రెడ్డిష్ బ్లాచ్ వ్యాధి: ఖాండ్రోకోకస్ కాలుమ్నారిస్ అనే బాక్టీరియం వల్ల ఈ వ్యాధి కలుగును.
ఆక్సిజన్ తక్కువగాఉండు నీటిలో పెరుగు చేపలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చును. చర్మముపై మచ్చలేర్పడటము అవి దేహమంతటా విస్తరించి పుళ్ళుగా మారి చేపలు మరణిస్తాయి. పుళ్ళు ఎర్రగా ఉండి రక్తము కారుతూ ఉంటాయి.
చికిత్స: 0.5% - 2% కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణము నందు రెండు నిముషముల చొప్పున 5 రోజుల పాటు ద్వారా వ్వ్యాధిని నివారించవచ్చును.
చేపలకు సోకు వివిధ శిలీంద్ర వ్యాధులు
అనేక రకములైన శిలీంద్రములు చేపలను వివిధరకములైన వ్యాధులను కలిగించును.
మొప్పల ద్వారా, దేహములో శ్లేష్మము కోల్పోయిన చర్మము ద్వారా ఇవి శరీరము లోనికి ప్రవేశించును. వీటికి నివారణ, చికిత్స కలదు.
ఎ. బ్రాంఖియోమైసిస్: దీనినే గిల్ రాట్ అని కూడా అంటారు. ఇది బ్రాంఖియోమైసిస్ సాంగ్యుని అనే శిలీంద్రము వలన కలుగును. ఇవి చేప మొప్పలను చేరి అక్కడి కణజాలమును నాశనము చేయును.
మొప్ప కణజాలము ఎండిపోతుంది, పనిచేయదు. తద్వారా చేపలకు ఆక్సిజన్ అందక మరణీస్తాయి. మరణమునకు ముందు చేపలు నీటి ఉపరితలముపైకి వచ్చి నోటితో గాలిపీల్చుకోవటం గమనించవచ్చును. ఇది ఒకచేపనుండి మరొక చేపకు నీటిద్వారా సంక్రమించును. వ్యాధికలిగిన చేపలను వేరుచేయాలి.
చికిత్స: ఈ వ్యాధికి గురయిన చేపలను ఫార్మాలిన్, కాపర్ సల్ఫేట్ ద్రావణములో 5-10 నిముషముల పాటు 6 రోజులు ఉంచినట్లయితే మరణములు తగ్గుతాయి. చెరువును ఎండబెట్టి సున్నము జల్లటం ద్వారా చెరువు అడుగున ఉన్న స్పోరులు నాశనం అవుతాయి. .
బి. డెర్మటోమైకోసిస్: ఈ వ్యాధిలో చర్మము మొప్పలు, వాజములు, నేత్రముల యందు కల కణజాలము శిలీంద్రము వలన విచ్చిన్నమై పుళ్ళు ఏర్పడును. సంక్రమించిన ప్రాంతములో తెల్లని తంతువుల వంటి శిలీంద్ర నిర్మాణములు వేలాడుతూ కనపడును.
నేత్రములకు సంక్రమించినపుడు, చేపలు దృష్టిని కోల్పోవును.
నేత్రముల
ద్వారా మెదడును చేరి కూడా శిలీంద్రములు చేరి నాడీకణజాలమును విచ్ఛిన్నపరచును.
చికిత్స: వ్యాధి సోకిన చేపలను 1% పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణములో రోజుకు 90 నిముషముల చొప్పున 6 రోజులపాటు
ఉంచినట్లయితే నయమౌతుంది.
సి. సిస్టెమిక్ మైకోసిస్: ఎఫినోమైసిస్ వంటి కొన్ని శిలీంద్రములు ఆహారము ద్వారా దేహము లోనికి ప్రవేశించి, అంతరాంగములయిన కాలేయము, మూత్రపిండము, బీజకోశముల వంటి భాగములను చేరి పుళ్లను కలిగించి మరణము సంభవింపచేయును.
ఇట్టి వ్యాధిని సిస్టెమిక్ మైకోసిస్ అంటారు.
ఇవి శరీరములోపలినుంచి చర్మం వరకూ పుళ్ళను కలిగిస్తాయి. ఆ స్థితిని ఇక్తియో ఫోనస్ అంటారు.
చికిత్స: కాపర్ సల్ఫేట్ ద్రావణమును 0.5 – 1.0 ppm చొప్పున చెరువునీటిలో ప్రతిమూడురోజుల వ్యవధిలో మూడు సార్లు చల్లాలి
డి. సాప్రొలెగ్నియాసిస్: దీనినే “వాటర్ మోల్డ్ డిసీజ్” అనికూడా అంటారు.
సాప్రొలెగ్నియా కు చెందిన శిలీంద్రముల వలన ఇది కలుగును.
చెరువులో క్రుళ్ళుతున్న పదార్ధములు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి చెలరేగుతుంది. చేప చర్మముపై శిలీంద్రము దూది పోగుల వంటి తెల్లని నిర్మాణములను కలుగచేయును. ఇవి విస్తరించి చర్మమంతా పుళ్ళు ఏర్పడును.
చికిత్స: చెరువులో మాలకైట్ వంటి శిలీంద్రనాశినిని 0.15 ppm సాంద్రతలో చెరువులో జల్లుట ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చును