చేపల మాధ్యమిక ఉత్పత్తులను తెలుపుము?
జ. చేపలు అనాదిగా మానవునికి ఆహారముగా ఉపయోగపడుచున్నవి. చేపల వలలలో, మనం తినే చేపలతో పాటు అనేక ఇతర తినని చేపలు కూడా చిక్కుతాయి.
అంతేకాక చేపలను నిల్వచేసేటప్పుడు తలలు, తోకలు, అంతరాంగ అవయువాలు వంటి వివిధ వ్యర్ధాలు మిగిలిపోతాయి. అటువంటి తినని చేపలు, మిగిలిపోయిన చేపల వ్యర్ధాలనుండి అనేక మాధ్యమిక (బై ప్రొడక్ట్స్) ఉత్పత్తులను తయారు చేస్తారు. అవి....
ఎ.చేపల ఎరువులు: మానవునిచే ఆహారముగా వినియోగింపబడని చేపలన్నియు ఎరువుల ఉత్పత్తికి వినియోగించవచ్చును. చనిపోయి, చెడిపోయిన చేపలు ఎక్కువ సంఖ్యలో పట్టుబడినపుడు వాటిని ఎండబెట్టి, బూడిదతో కలిపి పొడిచేయుట ద్వారా ఎరువులను తయారుచేస్తారు.. ఇట్టి ఎరువుల్లో NPK లు అధికంగా ఉండి మొక్కలు బాగ పెరుగుతాయి.
బి. చేప మీల్: చేపనూనెలను తయారు చేసిన పిదప మిగిలిన చేపల పిప్పినుండి చేప మీల్ (fish meal) తయారుచేస్తారు. మేలు రకపు ఫిష్ మీల్ ను పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
ఫిష్ మీల్ నందు 50-70% ప్రొటీనులు, 10-20% మినరల్స్ ఉంటాయి.
తక్కువ రకానికి చెందిన ఫిష్ మీల్ ను టీ, కాఫీ, పుగాకు పంటలలో ఎరువుగా వాడతారు.
సి. ఐసిన్ గ్లాస్ లేక చేప మాస్: పిల్లి చేపలు, పెర్చ్ చేపలు, సయనిడ్ చేపల వాయుకోశములను తొలగించి నీటితో శుభ్రపరచి, వాటి పైపొరను తొలగిస్తారు.
మిగిలిన లోపలిపొరను చదునుచేసి ఎండబెట్టి అమ్మకానికి మార్కెట్ కు తరలిస్తారు. ఎండిన ఈ పొరను బీరులో నానబెట్టిన యెడల శ్లేష్మయుతముగా మారుతుంది. దీనిని ఐసిన్ గ్లాస్ అంటారు. దీనిని పరిశ్రమలలో మద్యం, వెనిగార్, ఇంకు వంటి ద్రావణములలోని మలినములు తొలగించి శుద్ధిపరచటానికి ఉపయోగిస్తారు.
డి. చేప జిగురు/కీలు (fish glue) చేపల చర్మము, వాజములు ఎముకలను శుద్దిచేసి పొడిచేసిన పిదప ఆవిరిపాత్రలలో 6 నుంచి 8 గంటలపాటు ఎసిటికామ్లముతో కలిపి ఉడకపెట్టినపుడు ఏర్పడు ద్రావణము జిగురు స్వభావాన్ని కలిగిఉంటుంది. దీనిని చిక్కపరచటం వలన కీలుగా మారుతుంది.
దీనిని బైండింగ్ పరిశ్రమల్లో, చెక్క పరిశ్రమల్లో, పేపరుపెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.
ఇ. షాగ్రిన్ / చేప చర్మము: షార్క్ మరియు రే చేపల చర్మము చాలా గరుగ్గ్గా ఉంటుంది.
అట్టి చర్మాలను పదును చేసి గరుకు కాగితము వలె తయారుచేసి నగిషీ పనులకు వాడతారు.
దానిని షాగ్రిన్ అంటారు.
కొన్ని ఇతర చేపల చర్మమును పర్సులు, బూట్లను తయారు చేయటానికి వాడతారు.
ఎఫ్. చేప హైడ్రోసిలేట్: తాజా చేపలనుతీసుకొని, చిన్న చిన్న ముక్కలుగా తరిగి, దానికి తగినంత సల్ఫూరిక్ ఆమ్లమునుకలిప 12 నుండి14 గంటల వరకు మరిగించాలి. తరువాత దానికి క్షారమును కలిపితే చేపముక్కలు పూర్తిగా ద్రవరూపంలోకి మారుతాయి. దీనిని వడకట్టి ఎండబెట్టాలి. ఇలా తయారైన పదార్ధమును చేప హైడ్రొసిలేట్ అంటారు.
దీనిని వివిధ రకాల ఆహారపదార్ధాల తయారీకి, బెవరేజెస్, సూప్ లకు చేపరుచి, వాసన కొరకు వాడతారు.
జి. చేప పెంట: పాడయిన చేపలను,
క్రుళ్ళిన చేప వ్యర్ధాలను పెద్ద పెద్ద గోతులలో కప్పెట్టి 30-60 రోజుల పాటు ఉంచుతారు. తరువాత దానిని తవ్వి ఎండబెట్టి చేలకు ఎరువుగా వాడతారు.
హెచ్. చేపనూనెలు: చేపలనుంచి రెండు రకముల నూనెలను తయారుచేస్తారు.
1. చేపల మొత్తము దేహం నుండి తయారుచేయబడు నూనెలు: అధికంగా క్రొవ్వును కలిగి ఉండే హెర్రింగ్స్, మేహడన్, వంటి చేపలను పెద్ద పెద్ద ఇనుప పాత్రలలో పెట్టి ఉడకపెడతారు.
వీటి దేహములో కల నూనెలు పైకి తెట్టువలె తేలతాయి.
దానిని వేరుచేసి రంగులు, క్రొవ్వొత్తులు, తోలు, స్ట్రీలు వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
పడవల పైపూతగా కూడా వాడతారు
2. చేప కాలేయమునుంచి తయారుచేయబడు నూనెలు: షార్క్, కాడ్, స్కేట్ వంటి చేపల కాలేయములనుండి కాలేయ నూనెలను సేకరిస్తారు. ఇట్టి నూనెలలో అధిక మోతాదులో A,D,E,K విటమిన్లను ఉంటాయి కనుక వీటిని ఔషదాల తయారీలో వినియోగిస్తారు.
కాడ్ లివర్ నూనె కాడ్ చేపల కాలేయముల నుండి సేకరించిన నూనెను కాడ్ లివర్ ఆయిల్ అంటారు. ఇది లేత పసుపు వర్ణంలో ఉంటుంది.
దీనిలో విటమిన్ ఎ మరియు డి లు అధికంగా ఉంటాయి.
దీనిని రికెట్స్ వ్యాధితో బాధపడుచున్న రోగులకు, ఇతరులకు అదనపు పోషకపదార్ధము గాను ఇస్తారు.
షార్క్ లివర్ నూనె భారత దేశ షార్క్ చేపలనుండి షార్క్ లివర్ ఆయిల్ తయారు ఎక్కువగా చేస్తారు.
విటమిన్ ఎ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది లేత నారింజ రంగులో ఉందును.
కాలేయ నూనెలను ఈ క్రింది పద్దతుల ద్వారా సంగ్రహిస్తారు.
ఉడకపెట్టుట/ఆవిరి పెట్టుట: ఇది సాంప్రదాయపద్దతి.ఇందులోతాజాగా సేకరించిన కాలేయములను ముక్కలు చేసి పెద్దపెద్ద పాత్రలలో ఉడకపెడతారు. ఆ వేడికి కణజాలములో ఉన్న నూనె పైకి తెట్టువలె తేలును. దానిని వేరుచేసి, వడకట్టి మార్కెట్ కు తరలిస్తారు.
ఆక్వాసైడ్ పద్దతి: ఈ పద్దతిలో కాలేయములకు ఆక్వాసైడ్ అనే ద్రావణము కలుపుతారు.
(ఆక్వాసైడ్ = పెరాల్డిహైడ్ + సోడియం కార్బొనేట్). ఆక్వాసైడ్ కణజాలమును కరిగించి గుజ్జుగా మారుస్తుంది. ఈ గుజ్జులోకి నీటి ఆవిరి పంపిస్తారు.
ఈ ప్రక్రియలో కాలెయ నూనెలు పైకి తెట్టువలె తేలతాయి.
దానిని సేకరించి, వడకట్టి వినియోగిస్తారు.
ఆల్కలి ఎంజైమ్ పద్దతి: ఇందులో గుజ్జుగా చేసిన కాలేయములకు HCL, నీరు పెప్సిన్ (ఎంజైమ్) లను చేర్చి 40-49oC వద్ద వేడి చేస్తారు. తరువాత సోడియం హైడ్రాక్సైడ్ కలిపి 80oc వరకు వేడి చేస్తారు. ఈ గుజ్జు లోకి ఆవిరి పంపించినపుడు నూనెలు తెట్టువలె పైకి తేలతాయి. వాటిని సేకరించి, వడకట్టి వినియోగిస్తారు. ఇది ఆధునిక పద్దతి
ఐ. కృత్రిమ ముత్యములు తయారుచేయుట: చేపల పొలుసులందుగల మెరిసే పొరను తొలగించి గాజుపూసల లోపలి పూతగా వేస్తారు.
ఇట్టి పూసలను మైనముతో నింపి కృత్రిమ ముత్యములు గా విక్రయిస్తారు.
జె. షార్క్ వాజములు (shark fins) సొరచేపల వాజములతో తయారు చేసే సూప్ (పులుసు) నకు చైన, జపాన్ లలో మంచి గిరాకి కలదు. కనుక వాటిని కత్తిరించి, ఎండపెట్టి మార్కెట్ చేస్తారు.
కె. ఆంబెర్గ్రిస్: స్పెర్మ్ వేల్ జీర్ణాశయములో ఉండే ఒకరకమైన బూడిద రంగు జిగురు పదార్ధాన్ని ఆంబెర్గ్రిస్ అంటారు. ఇది మత్తైన వింతవాసనను కలిగిఉంటుంది. కనుక దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు. ముత్యాల తరువాత అత్యంతవిలువైన సముద్ర ఉత్పత్తి ఇది.
ఎల్. ఫిష్ రో (fish roe, Cavier) గుడ్లను లెక గుడ్లను కలిగి ఉన్న చేపయొక్క గుడ్లతిత్తిని రో అని అంటారు. ఉప్పు, పెప్పర్ వేసి ఉడికించిన రో ను కావియర్ అంటారు. స్టర్జన్, కాడ్ వంటి కొన్ని చేపల కావియర్ అత్యంత ఖరీదైన వంటకము. దీనిని తినటం విలాసానికి, ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు.
ముగింపు
పై ఉత్పత్తులలో కొన్ని కాలేయ నూనెలు, ఫిష్ హైడ్రొసిలేట్ వంటివి వైద్యపరమైన ప్రాధాన్యత కలిగి ఉన్నవి. ఫిష్ గ్లూ, ఇసిన్ గ్లాస్, ఫిష్ మెన్యూర్ వంటి మరికొన్ని పారిశ్రామికంగా ఉపయోగపడుచున్నవి. కనుక చేపలు ఆహారంగా మాత్రమే కాక వివిధ రకాలైన మాధ్యమిక ఉత్పత్తులను అందిస్తూ మనకు ఎంతో ఉపయోగ పడుచున్నవి.